Telangana: జగ్గారెడ్డికి మరో కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల
- షర్మిల, జగ్గారెడ్డిల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
- తనకు చాలెంజ్ విసరడానికి జగ్గారెడ్డి ఎవరన్న షర్మిల
- జగ్గారెడ్డి మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలేనని వ్యాఖ్య
- పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా భయపడలేదని వెల్లడి
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల... అక్కడి స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఉన్న జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు. షర్మిల విమర్శలకు వేగంగా స్పందించిన జగ్గారెడ్డి... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన సందర్భంగా జగన్ ఫ్యామిలీ అసలు బాధ పడలేదని, తదుపరి సీఎం ఎవరన్న దిశగా ఆలోచనలో మునిగిపోయిందని వ్యాఖ్యానించారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మంగళవారం షర్మిల మరోమారు ఘాటుగా స్పందించారు. జగ్గారెడ్డి తనను బెదిరించినట్లుగా మాట్లాడారట అంటూ మొదలుపెట్టిన షర్మిల... జగ్గారెడ్డి చాలెంజ్‌కు తాను భయపడబోనని అన్నారు. జగ్గారెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆమె అన్నారు. తన తండ్రి చనిపోయిన రోజు జగ్గారెడ్డి పరామర్శకు వస్తే తాము రాజకీయాలు మాట్లాడామని ఆయన అన్నారని షర్మిల మండిపడ్డారు. నాడు తమ కుటుంబం పడిన బాధ తమకే తెలుసునన్నారు. అసలు తాము బతుకుతామా? చస్తామా? అన్నట్లుగా బాధపడ్డామన్నారు. అసలు తనకు చాలెంజ్ విసరడానికి జగ్గారెడ్డి ఎవరు? అని కూడా షర్మిల ప్రశ్నించారు.
పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అంతా తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా తాను భయపడలేదని షర్మిల అన్నారు. మంత్రి తనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా తాను భయపడలేదన్నారు. రాజశేఖరరెడ్డి బిడ్డగా తాను ఎవరికీ భయపడబోనన్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సంకెళ్లు చూపించి మరీ తాను సవాల్ విసిరానని తెలిపారు. తనలో ఉన్నది వైఎస్సార్ రక్తమని, తాను పులి బిడ్డనని షర్మిల అన్నారు.