Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
- ఇవాళ అదానీ గ్రూప్ కు భారీ నష్టం
- ఒక్కరోజులో రూ.57 వేల కోట్లు ఆవిరి
- తన రెండోస్థానాన్ని జెఫ్ బెజోస్ కు కోల్పోయిన అదానీ
- అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
- 11వ స్థానంలో ముఖేశ్ అంబానీ
భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయాడు. ఇటీవలే ఆయన రెండో స్థానానికి ఎగబాకి వ్యాపార ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు.
అయితే, గత కొన్నిరోజులుగా ట్రేడింగ్ లో ప్రతికూల ధోరణులు అదానీ గ్రూప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇవాళ ఒక్కరోజే అదానీకి రూ.57 వేల కోట్ల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. దాని ఫలితమే గౌతమ్ అదానీ బ్లూంబెర్గ్ మిలియన్ ఇండెక్స్ లో తన రెండోస్థానాన్ని అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు కోల్పోయారు.
ప్రస్తుతం జెఫ్ బెజోస్ నికర సంపద 138 బిలియన్ డాలర్లు కాగా, గౌతమ్ అదానీ సంపద 135 బిలియన్ డాలర్లు అని బ్లూంబెర్గ్ వెల్లడించింది.
కాగా, ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 245 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 82.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు.