Recession: ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది.. విప్లవాత్మక విధానాలు అవసరం: డబ్ల్యూటీఓ
- ప్రస్తుతం ప్రపంచం అనేక సంక్షోభాల మధ్య ఉందని వ్యాఖ్య
- ప్రధానంగా ఆహార భద్రత విషయంలో ఆందోళన ఉందని వివరణ
- ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని వెల్లడి
ఉక్రెయిన్ పై రష్యా దాడి, వాతావరణ సంక్షోభం, ఆహార ధరలు, ఇంధన కొరత, కొవిడ్ అనంతర పరిణామాలు వంటి ఎన్నో కారణాలతో ప్రపంచం మాంద్యం వైపు పయనిస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) హెచ్చరించింది. ప్రధానంగా ఆహార భద్రత అంశం ఆందోళన రేపుతోందని పేర్కొంది. దీనికి సంబంధించి డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ నెగోజి ఒకోంజో జెనీవా వార్షిక పబ్లిక్ ఫోరంలో మాట్లాడారు. వృద్ధిని పెంపొందించేందుకు విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గాయి
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి రెండూ కూడా ప్రపంచ, దేశాల వృద్ధి అంచనాలను తగ్గించాయని డబ్ల్యూటీఓ చీఫ్ చెప్పారు. ప్రపంచం మాంద్యం అంచున ఉండటమే దీనికి కారణమని.. మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతాపర సమస్యలు, ఇంధన కొరత, వాతావరణ మార్పులు, ఆహార ధరలు వంటి సంక్షోభాలు అన్ని దేశాలకు విస్తరించాయన్నారు. బ్యాంకులు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.