Rahul Gandhi: 19 ఏళ్ల బాలికను బీజేపీ నేత కుమారుడు హత్య చేయడంపై రాహుల్ మండిపాటు
- మహిళలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడటమే బీజేపీ సిద్ధాంతమన్న రాహుల్
- మహిళలను గౌరవించలేని వారు ఏమీ సాధించలేరని వ్యాఖ్య
- మోదీ పాలన క్రిమినల్స్ ను కాపాడటానికే సరిపోతోందన్న రాహుల్
ఉత్తరాఖండ్ లో 19 ఏళ్ల బాలిక అంకిత భండారి హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీజేపీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... బీజేపీ, ఆరెస్సెస్ పై మండిపడ్డారు. మహిళలను బీజేపీ, ఆరెస్సెస్ కేవలం ఒక వస్తువుగానో లేక ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే చూస్తుందని అన్నారు. బీజేపీ అసలైన సిద్ధాంతం ఇదేనని చెప్పారు. అధికారాన్ని తప్ప బీజేపీ మరేదాన్నీ గౌరవించదని అన్నారు.
బీజేపీ నేత హోటల్ ను నిర్వహిస్తున్నాడని... ఆయన కొడుకు ఒక అమ్మాయిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడని... దానికి ఆమె ఒప్పుకోలేదని... అనంతరం ఆమె రిషికేశ్ సమీపంలోని ఒక కెనాల్ వద్ద శవంగా తేలిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ మహిళలను ఏ విధంగా చూస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. ఇలాంటి ఆలోచనలతో బీజేపీ ఎంతో కాలం అధికారంలో ఉండలేదని చెప్పారు. మహిళలను గౌరవించలేని వారు ఏమీ సాధించలేరని అన్నారు. 'సేవ్ ది గర్ల్ చైల్డ్' అనేది మోదీ నినాదమని... బీజేపీ కర్మ ఏమిటంటే... సేవ్ రేపిస్ట్ అనేది దాని నినాదమని ఎద్దేవా చేశారు. మోదీ పాలన క్రిమినల్స్ ను కాపాడడానికే సరిపోతోందని విమర్శించారు.