Telangana: సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించిన సీఎం కేసీఆర్
- సింగరేణి లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు చెల్లింపు
- దసరా లోపుగా చెల్లింపులు పూర్తి కావాలన్న సీఎంఓ
- సింగరేణి కార్మికులకు రూ.368 కోట్ల మేర అందనున్న కానుక
- గతేడాది కంటే కార్మికులకు 1 శాతం పెరిగిన లాభాల వాటా
సింగరేణి కార్మికులకు దసరా పండుగ కానుకను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతాన్ని కార్మికులకు పంచాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ లాభాల వాటాను కార్మికులకు దసరా పండుగ లోపుగానే అందజేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సింగరేణి లాభాల్లో 30 శాతం వాటా అంటే... ఈ ఏడాది కార్మికులకు రూ.368 కోట్లు అందనున్నాయి. సింగరేణి సంస్థ లాభాల్లో వాటాను కార్మికులకు దసరా కానుకగా ఇస్తుండటం ఈ సారి కొత్తేమీ కాకున్నా... గతేడాది కంటే లాభాల వాటాను కేసీఆర్ సర్కారు 1 శాతం మేర పెంచింది. 2020లో సంస్థ లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు దసరా కానుకగా ఇవ్వగా... 2021లో దానిని 29 శాతానికి పెంచారు. తాజాగా ఈ ఏడాది లాభాల్లో కార్మికుల వాటాను 30 శాతానికి పెంచారు.