BJP: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కారు
- ఉద్యోగుల డీఏను 4 శాతం మేర పెంచిన కేంద్రం
- మూల వేతనంలో 38 శాతానికి చేరిన డీఏ
- 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ కూడా పెరగనున్నట్లు కథనాలు
దసరా పండుగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కారు తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను మరో 4 శాతం పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్య ఉద్యోగుల డీఏ శాతం మూల వేతనంలో 38 శాతానికి చేరింది. ఈ డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పింఛన్‌దారులకు కూడా వర్తించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ కూడా పెరిగే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.