OMC Case: ఓఎంసీ కేసులో మంత్రి సబిత, ఐఏఎస్ శ్రీలక్ష్మీ డిశ్చార్జీ పిటిషన్లను కొట్టివేయాలన్న సీబీఐ.. విచారణ రేపటికి వాయిదా
- నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఓఎంసీ కేసు విచారణ
- సబిత, శ్రీలక్ష్మీ, దేవానందం, రాజగోపాల్‌ల డిశ్చార్జీ పిటిషన్లపై విచారణ
- నిందితులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీబీఐ
- నిందితుల వివరణ కోసం విచారణను గురువారానికి వాయిదా వేసిన కోర్టు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల (ఓఎంసీ) కేసుపై హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో నుంచి తమను తప్పించాలంటూ తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ కేడర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీ, రిటైర్డ్ అధికారులు దేవానందం, రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్లపై సీబీఐ తన వాదనలను ముగించింది. నలుగురు నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్లను కొట్టివేయాలని సీబీఐ కోరింది.
ఈ కేసులో ఈ నలుగురు నిందితులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పిన సీబీఐ.. అందుకు తగ్గ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ముగియడంతో నిందితుల తరఫు వివరణ కోసం విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. నిందితుల వివరణ తెలియజేశాక ఈ వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.