Bipin Rawat: భారత త్రివిధ దళాల అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియామకం
- లెఫ్ట్‌నెంట్ జనరల్ హోదాలో పదవీ విరమణ పొందిన అనిల్
- హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్
- నాటి నుంచి ఖాళీగానే ఉన్న సీడీఎస్ పోస్టు
భారత త్రివిధ దళాల నూతన అధిపతి (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ జనరల్ హోదాలో పనిచేసిన అనిల్... ఇటీవలే పదవీ విరమణ పొందారు. తాజాగా ఆయనను కేంద్ర ప్రభుత్వం నూతన సీడీఎస్‌గా నియమించింది.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నాడు సీడీఎస్‌గా ఉన్న బిపిన్ రావత్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బిపిన్ రావత్ మరణం తర్వాత సీడీఎస్ పోస్టు ఖాళీగానే ఉంది. తాజాగా ఆ స్థానాన్ని అనిల్ చౌహాన్‌తో కేంద్రం భర్తీ చేసింది.
త్రివిధ దళాధిపతిగా సీడీఎస్ హోదాలో అనిల్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వానికి, మిలిటరీ వ్యవహారాల విభాగానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అనిల్ చౌహాన్ 1961 మే 18న జన్మించారు. భారత సైన్యంలో ఆయన 1981లో చేరారు. తొలుత 11 గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ లో పనిచేశారు.
సైన్యంలో వివిధ స్థాయుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు చొరబాట్లను అడ్డుకోవడంలో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ కు విశేష అనుభవం ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఖడక్ వాస్లా), ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో శిక్షణ పొందారు.