Team India: టీమిండియా బౌలర్ల విజృంభణ.. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
- టీమిండియా, దక్షిణాఫ్రికా తొలి టీ20
- తిరువనంతపురంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- విజృంభించిన అర్షదీప్, చహర్
తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో పిచ్ పేరుకు తగ్గట్టే పచ్చికతో పచ్చగా కనిపిస్తోంది. దాంతో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు బౌలర్లు అద్భుతం అనదగ్గ ఆరంభాన్నిచ్చారు. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, దీపక్ చహర్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. దాంతో దక్షిణాఫ్రికా జట్టు 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (0)ను డకౌట్ చేయడం ద్వారా చహర్ దక్షిణాఫ్రికా వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత అర్షదీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో సఫారీలు విలవిల్లాడారు.
తొలుత డికాక్ (1)ను బౌల్డ్ చేసిన అర్షదీప్... అదే ఓవర్లో చివరి రెండు బంతులకు రిలీ రూసో (0), ప్రమాదకర డేవిడ్ మిల్లర్ (0)లను డకౌట్ చేయడంతో టీమిండియాలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత చహర్ మరోసారి విజృంభించి దక్షిణాఫ్రికా యువకెరటం ట్రిస్టాన్ స్టబ్స్ (0)ను పెవిలియన్ కు పంపాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 5 ఓవర్లలో 5 వికెట్లకు 26 పరుగులు. క్రీజులో ఐడెన్ మార్ క్రమ్ (14 బ్యాటింగ్), వేన్ పార్నెల్ (8బ్యాటింగ్) ఉన్నారు.