R Venkataramani: అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణి నియామకం
- 2017 నుంచి అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న వేణుగోపాల్
- అటార్నీ జనరల్ పదవిని తిరస్కరించిన ముకుల్ రోహత్గీ
- రాష్ట్రపతి ఆమోదంతో వెంకటరమణిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు
భారత అటార్నీ జనరల్ (ఏజీఐ)గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం భారత అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ కొనసాగుతున్నారు. 2017లో ఈ పదవిలో నియమితులైన వేణుగోపాల్ సర్వీసును 2020లో నాటి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మరోమారు పొడిగించారు. వేణుగోపాల్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్గీని ఆ పదవిలో నియమించేందుకు కేంద్రం సిద్ధం కాగా... రోహత్గీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
వెంకటరమణికి న్యాయవాదిగా 40 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం ఉంది. వెంకటరమణి లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ సభ్యుడు కూడా. ఆయన 1977 జూలైలో తమిళనాడు బార్ కౌన్సిల్ లో చేరారు. 1997 లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీతో కూడా ఆయన అనుబంధం కలిగి ఉన్నారు.