Bihar: ఉచితంగా ఇస్తే కండోములు కూడా కావాలంటారు: మహిళా ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో బిత్తరపోయిన విద్యార్థినులు
- పాఠశాల విద్యార్థులతో ‘శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్’ కార్యక్రమం
- విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తోందన్న విద్యార్థిని
- రూ. 30 విలువ చేసే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వలేదా? అని ప్రశ్న
- ఇచ్చుకుంటూ పోతే కండోములు కూడా అడుగుతారన్న ఐఏఎస్ అధికారిణి
‘ఫ్రీగా ఇస్తే కండోములు కూడా కావాలంటారు’.. ఈ మాటలన్నది ఎవరో కాదు, అఖిల భారత స్థాయి ఉద్యోగిని. అది కూడా విద్యార్థినులతో. ఎవరైనా ఊహిస్తారా? ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని. కానీ చేశారు. ఆమె వ్యాఖ్యలతో విద్యార్థినులు బిత్తరపోయారు. బీహార్లో జరిగిందీ ఘటన. ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. పాట్నాలో విద్యార్థులతో ‘శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీహార్ విమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్జోత్ కౌర్ మాట్లాడుతుండగా.. ఓ విద్యార్థిని కల్పించుకుని విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు, సైకిళ్లు వంటివి ఇస్తోందని, వారి కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వం.. రూ. 20-30 విలువ చేసే శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు హర్జోత్ కౌర్ తీవ్రంగా రియాక్టయ్యారు. కోరికలకు అంతు ఉండక్కర్లేదా? అని గద్దిస్తూనే.. ఈ రోజు నాప్కిన్స్ అడుగుతున్నారని, ఇలాగే ఇచ్చుకుంటూ పోతే చివరికి కుటుంబ నియంత్రణ కోసం కండోములను కూడా ఉచితంగా ఇమ్మంటారని హర్జోత్ కౌర్ చేసిన వ్యాఖ్యలతో అమ్మాయిలు బిత్తరపోయారు. ఆ వెంటనే తేరుకుని.. ఓట్ల కోసం వచ్చినప్పుడు హామీలు ఇస్తారు కదా? అని విదార్థినులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా ఆమె తీవ్రంగానే స్పందించారు. ‘‘అయితే ఓట్లు వేయొద్దు. పాకిస్థాన్లా మారిపోండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.