TRS: ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చేశారన్న వార్తలపై ఎంపీ సంతోష్ కుమార్ స్పందన
- తాను ఎక్కడికీ వెళ్లలేదు.. ప్రగతి భవన్‌లోనే ఉన్నానని స్పష్టీకరణ
- ఓ ఆంగ్ల పత్రిక కథానాన్ని ఖండించిన సంతోష్ కుమార్
- తాను ఎల్లప్పుడూ కేసీఆర్ సేవలోనే ఉంటానని స్పష్టం చేసిన ఎంపీ
రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీప బంధువు జోగినపల్లి సంతోష్ కుమార్ గురించి కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ ఓ విషయంలో మందలించడంతో కలత చెందిన సంతోష్ ఫోన్ స్విచాఫ్ చేసుకొని ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారన్నది ఈ వార్త సారాంశం.
నిత్యం కేసీఆర్ వెన్నంటి ఉండే సంతోష్ ప్రగతి భవన్ నుంచి కూడా బయటకు వచ్చేశారని, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ వార్తలను సంతోష్ ఖండించారు. సీఎం కేసీఆర్‌కు, తనకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుందంటూ ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు.
ఈ విషయమై ఆ పత్రికకు వివరణ ఇచ్చారు. తన నాయకుడు, జీవితానికి ఏకైక స్పూర్తి అయిన కేసీఆర్ దగ్గరే ఉంటానని స్పష్టం చేశారు. “నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను. నా నాయకుడు, నా జీవితానికి ఏకైక శక్తి, స్ఫూర్తి అయిన కె. చంద్రశేఖర్ రావుతోనే ఉంటాను” అని స్పష్టం చేశారు. కేసీఆర్ తలపెట్టిన బృహత్కార్యానికి తాను సేవకుడిని మాత్రమేనని సంతోష్ చెప్పారు. ఈ విషయంలో తన నమ్మకాన్ని ఈ భూమ్మీద ఏ శక్తి కూడా మార్చలేదని స్పష్టం చేశారు.
తనను తాను నాయకుడిని అనుకోనని సంతోష్ చెప్పారు. తాను కేసీఆర్‌కు సేవ చేయడానికే పనిచేస్తున్నాని.. ఆయన లేకుంటే తాను ఏమీ కానని చెప్పారు. ఆయన ఆజ్ఞలన్నింటినీ వినయంగా పాటించడమే తన జీవితంలో ఏకైక పని అని పేర్కొన్నారు. కేసీఆర్ సేవలో తప్ప తాను మరెక్కడైనా ఉంటాననే మాటే హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రగతి భవన్ నుంచే మాట్లాడుతున్నానని దక్కన్ క్రానికల్ తో చెప్పారు.