BJP: సీఎంకు ఎవరు ఎదురు చెప్పినా వారిపై కేసులు నమోదవుతున్నాయి: మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి
- కడప జిల్లా యర్రగుంట్లలో బీజేపీ ప్రజాపోరు
- కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి
- జగన్కు కేంద్రం సరైన సమయంలో చెక్ పెడుతుందని వ్యాఖ్య
- షర్మిల, సునీతలను బాధపెట్టి జగన్ ఏం సాధించారని ప్రశ్న
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీ శాఖ చేపట్టిన ప్రజా పోరులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆదినారాయణ రెడ్డి వివేకా హత్య కేసును ప్రస్తావించారు. ఈ కేసులో దేవిరెడ్డి శివశంకరరెడ్డి కింగ్ పిన్ అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.
వివేకా హత్య కేసులో సీఎం జగన్ బండారం కూడా బయటపడుతుందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తోడబుట్టిన చెల్లి షర్మిల, చిన్నాన్న కూతురు సునీతలను బాధపెడుతున్న జగన్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ఆడపడుచులకు భద్రత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్కు ఎవరు ఎదురు చెప్పినా వారిపై కేసులు నమోదవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు సరైన సమయంలో కేంద్రం చెక్ పెడుతుందని ఆదినారాయణ రెడ్డి అన్నారు.