Ian: అమెరికాపై 'ఇయన్' హరికేన్ పంజా... వీధుల్లోకి వచ్చిన రాకాసి సొరచేపలు
- ఫ్లోరిడా వద్ద తీరాన్ని తాకిన 'ఇయన్'
- గంటకు 241 కిమీ వేగంతో ప్రచండ గాలులు
- కుండపోత వర్షాలు.. అంధకారంలో ఫ్లోరిడా
- పలు ప్రాంతాల్లో ఉప్పెన.. కొట్టుకుపోయిన ఇళ్లు
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఇయన్' హరికేన్ ప్రచండ వేగంతో అమెరికా తీరాన్ని తాకింది. ఫ్లోరిడా వద్ద అమెరికా భూభాగంపై ప్రవేశించిన 'ఇయన్' విలయం సృష్టించింది. అమెరికా గడ్డను తాకిన పవర్ ఫుల్ హరికేన్లలో 'ఇయన్' ఒకటని ప్రభుత్వం వెల్లడించింది.
గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కురిసిన వర్షంతో ఫ్లోరిడా అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో సంభవించిన ఉప్పెనలో ఇళ్లు కొట్టుకునిపోయాయి. సముద్రంలో ఉండాల్సిన రాకాసి సొరచేపలు వీధుల్లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ దర్శనమిచ్చాయి.
ఎక్కడికక్కడ ఇయన్ సృష్టించిన భారీ విధ్వంసంతో అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొందరు మీడియా రిపోర్టర్లు సాహసోపేతమైన రీతిలో లైవ్ కవరేజికి వెళ్లి పెనుగాలులకు నిలవలేక కొట్టుకుపోయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల పైకప్పులు ఎగిరిపోగా, కార్లు నీటిలో మునిగిపోయాయి. గాలుల వేగానికి చెట్లు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయాయి.
ప్రస్తుతం ఇయన్ తీవ్రత కేటగిరీ-1కి పడిపోయినా, అది ఇప్పటికీ ప్రమాదకరమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫ్లోరిడాతో పాటు వర్జీనియా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.