Andhra Pradesh: పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముప్పు లేదు: కేంద్ర ప్రభుత్వం
- ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం
- పోలవరం పూర్తయితే 3 రాష్ట్రాలకు ముప్పు లేదని వెల్లడి
- బ్యాక్ వాటర్‌పై మరోమారు సర్వే జరపాలన్న తెలంగాణ ప్రతిపాదనకు తిరస్కారం
- అక్టోబర్ 7న మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయం
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా ముప్పు ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన అధికారులతో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని నిర్వహించింది. వర్చువల్ పద్ధతిన జరిగిన ఈ సమావేశానికి 4 రాష్ట్రాల నుంచి నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.
అయితే పోలవరం ప్రాజెక్టు వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు ఆందోళనకు గురవుతున్న మాట వాస్తవమేనని కూడా కేంద్రం తెలిపింది. 2009, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్, దాని ప్రభావాలపై సర్వేలు జరిగాయని తెలిపింది. పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని నివారించేందుకు కరకట్ట నిర్మించేందుకు ఇదివరకే ఏపీ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కేంద్రం ఈ సందర్భంగా ప్రస్తావించింది.
అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోమారు బ్యాక్ వాటర్‌పై సర్వే చేయించాలని తెలంగాణ కోరగా.... అందుకు కేంద్రం నిరాకరించింది. అదే సమయంలో కరకట్ట నిర్మాణానికి ఏపీ సిద్ధమైన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది. ఇక తదుపరి చర్చలు అక్టోబర్ 7న జరుపుదామన్న కేంద్రం... ఆ సమావేశానికి 4 రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.