Titanic: టైటానిక్ నౌక సిబ్బంది ఆ రేడియో సందేశాన్ని పట్టించుకుని ఉంటే...!

If Titanic crew had taken the message seriously which radioed from SS Mesaba

  • చరిత్రలో మహా విషాదంగా టైటానిక్ ప్రమాదం
  • 1912లో ఘటన..1,500 మందికి పైగా జల సమాధి
  • టైటానిక్ ను హెచ్చరించిన మరో నౌక
  • కొంపముంచిన అతి విశ్వాసం

టైటానిక్ నౌకా విషాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత విలాసవంతమైన ఓడగా ఖ్యాతి పొంది, ఆర్భాటంగా సముద్రయానం ప్రారంభించి, చివరికి అత్యంత బాధాకర పరిస్థితుల నడుమ జలసమాధి అయిన చరిత్ర టైటానిక్ ది. దీనిపై వచ్చిన సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. 

ఇక అసలు విషయానికొస్తే... 1912 ఏప్రిల్ 15న టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ భారీ మంచుదిబ్బను ఢీకొని మునిగిపోయింది. బ్రిటన్ లోని సౌతాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 1,500 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం వెనుక టైటానిక్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్న వాదనలు ఉన్నాయి. 

అప్పట్లో టైటానిక్ సముద్రయానం చేస్తుండగా, ఆ భారీ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించడాన్ని మరో నౌక గుర్తించింది. ఆ నౌక పేరు ఎస్ఎస్ మసాబా. ఇది బ్రిటన్ కు చెందిన ఓ వాణిజ్యనౌక. ఆ మార్గంలో ప్రవేశించవద్దంటూ ఎస్ఎస్ మసాబా నుంచి టైటానిక్ కు ఓ రేడియో సందేశం వెళ్లింది. మంచు ఫలకాలు అధికంగా ఉండే ఆ మార్గం అత్యంత ప్రమాదకరం అన్నది ఆ సందేశం సారాంశం. 

అయితే, ఈ రేడియో సందేశాన్ని టైటానిక్ కమ్యూనికేషన్ సిబ్బంది తేలిగ్గా తీసుకున్నారు. టైటానిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ మునిగిపోని గొప్ప నౌక అని ప్రయాణానికి ముందు బ్రిటన్ లో భారీగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో, టైటానిక్ కమ్యూనికేషన్స్ సిబ్బందిలో అతి విశ్వాసం ఏర్పడింది. దాంతో ఎస్ఎస్ మసాబా నౌక పంపించిన రేడియో సందేశాన్ని వారు తమ నౌక కెప్టెన్ కు పంపకుండా నిర్లక్ష్యం వహించారు. 

ఒకవేళ ఆ సందేశాన్ని వారు కెప్టెన్ కు పంపి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని, ఆయన మెరుగైన నిర్ణయం తీసుకునేవారేమోనని చరిత్రకారులు ఇప్పటికీ వాదిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సందేశం టైటానిక్ కెప్టెన్ వరకు వెళ్లకపోవడం, టైటానిక్ నౌక ఆ ప్రమాదకర మార్గంలోనే వెళ్లడం చరిత్రలో ఒక మహావిషాదాన్ని లిఖించాయి. 

ఇప్పుడీ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే... నాడు టైటానిక్ కు రేడియో సందేశాన్ని పంపిన ఎస్ఎస్ మసాబా నౌక శిథిలాలను పరిశోధకులు ఇటీవలే గుర్తించారు. ఎస్ఎస్ మసాబా నౌక 1918లో ఓ జర్మనీ సబ్ మెరైన్ టార్పెడో దాడిలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌక కెప్టెన్ సహా 20 మంది మరణించారు. తాజాగా దీని శిథిలాలను ఐరిష్ సముద్రంలో కనుగొన్నారు.

  • Loading...

More Telugu News