Nitin Gadkari: భారత్ నిరుపేదలతో కూడిన సంపన్న దేశం: నితిన్ గడ్కరీ
- ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
- ఇప్పటికీ ఆకలి, నిరుద్యోగం, అంటరానితనంతో దేశం సతమతమవుతోందన్న గడ్కరీ
- ధనిక - పేదల మధ్య అంతరం పెరిగిపోతోందని వ్యాఖ్య
ప్రపంచంలోని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ... మన దేశం ఇప్పటికీ ఆకలి, నిరుద్యోగం, అధిక ధరలు, అంటరానితనం, కులతత్వంతో సతమతమవుతోందని అన్నారు.
దేశంలో ధనిక - పేద వర్గాల మధ్య నానాటికీ అగాథం పెరిగిపోతోందని చెప్పారు. ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు విద్య, ఆరోగ్యం, సేవా రంగాలపై దృష్టి సారించాలని చెప్పారు. భారత్ నిరుపేదలతో కూడిన సంపన్న దేశం అని అన్నారు. నాగపూర్ లో భారత్ వికాస్ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.