rbi mpc: మరోసారి రేట్లను పెంచిన ఆర్బీఐ.. రుణ చెల్లింపులపై భారం
- అర శాతం మేర పెరిగిన రెపో రేటు
- 5.90 శాతానికి చేరిన రెపో
- 7 శాతానికి వృద్ధి అంచనాల తగ్గింపు
ఆర్బీఐ ఎంపీసీ వరుసగా నాలుగో విడత కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. రెపో రేటును అర శాతం పెంచడంతో ఇది 5.90 శాతానికి చేరింది. ఇది మూడేళ్ల గరిష్ఠ స్థాయి. ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాల్లో మొత్తం 1.90 శాతం వరకు రెపో రేటును పెంచినట్టయింది. దీంతో రుణాలపై రేట్లు కూడా ఇదే స్థాయిలో పెరగనున్నాయి. ఎందుకంటే బ్యాంకులు రెపో ఆధారిత రుణాలనే ఎక్కువగా మంజూరు చేస్తున్నాయి.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) జీడీపీ వృద్ధి అంచనాలను దిగువకు ఆర్బీఐ సవరించింది. గతంలో 7.2 శాతంగా అంచనా వేయగా, తాజాగా దీన్ని 7 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం 7 శాతం స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు త్రైమాసికాలకు 6 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో ఆర్బీఐ పనిచేస్తోంది. ఆన్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్ల మాదిరే ఆఫ్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్లకు ఒకే నిబంధనలు తీసుకురావాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు.