Vande Bharat train: విమానంలో ప్రయాణించిన అనుభవం.. వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని
- గాంధీ నగర్ నుంచి కలుపూర్ వరకు ప్రయాణం
- ఆధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రతా సదుపాయాలు ఈ రైళ్ల సొంతం
- 30 శాతం తక్కువ విద్యుత్ వినియోగం
ఆధునికీకరించిన వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్ లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గాంధీ నగర్, ముంబై మధ్య వేగంగా ప్రయాణికులను వందే భారత్ రైలు చేరవేయనుంది.
ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఈ రైళ్లు విమానాల్లో మాదిరి అత్యాధునిక సౌకర్యాలతో ఉంటాయి. మెరుగైన ప్రయాణికుల భద్రతా ఫీచర్లు కూడా వందే భారత్ రైలు సొంతం. రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు.
180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లను అమర్చారు. కోచ్ వెలుపలి భాగంలో ప్లాట్ ఫామ్ సైడ్ కెమెరాలు, వెనుక భాగంలో కెమెరాలు అమర్చారు. దీంతో పైలట్లు కోచ్ పక్కన, వెనుక భాగంలోనూ ఏం జరుగుతుందో వీటి సాయంతో తెలుసుకోవచ్చు. సంప్రదాయ రైళ్లతో పోలిస్తే 30 శాతం తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. ఇంకా వైఫై, మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ సదుపాయాలు ఉన్నాయి.