AP High Court: హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ

AP DGP attends high court

  • హైకోర్టులో కర్నూలు జిల్లాకు చెందిన రైసు మిల్లు యాజమాన్యం పిటిషన్
  • పోలీసులు నిబంధనలు పాటించడం లేదన్న పిటిషనర్
  • తమ ముందు హాజరు కావాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం

ఏపీ హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ఈ కేసు కర్నూలు జిల్లాకు సంబంధించినది. పౌరసరఫరాల శాఖ, పోలీసులు నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మిల్లు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించలేదని గత వాయిదా సందర్భంగానే కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టుకు రావాల్సిందిగా డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో డీజీపీ కోర్టుకు హాజరయ్యారు.

రైస్ మిల్ల‌ర్లు, వాహ‌న‌దారుల‌ను రేష‌న్ బియ్యం పేరుతో పోలీసు అధికారులు వేధిస్తున్నారంటూ క‌ర్నూలుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు యాజ‌మాన్యం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. రేష‌న్ బియ్యం పేరిట నిత్యం త‌నిఖీలు చేస్తూ పోలీసులు మిల్ల‌ర్ల‌తో పాటు వాహ‌న‌దారుల‌ను వేధిస్తున్నార‌ని ఆ సంస్థ త‌న పిటిష‌న్‌లో హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. త‌న‌కు చెందిన మిల్లులో సోదాలు చేసిన పోలీసులు 5 వాహ‌నాల‌ను సీజ్ చేశార‌ని, దీనిపై కేసు పెట్టిన పోలీసులు... స‌ద‌రు విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికే తీసుకురాలేద‌ని తెలిపింది. ఇదంతా చూస్తుంటే పోలీసులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే వేధింపుల‌కు దిగుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంద‌ని వివ‌రించింది.

ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు... పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విచార‌ణ సంద‌ర్భంగా పిటిష‌నర్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన సీనియ‌ర్ న్యాయవాది ర‌వితేజ‌.. పోలీసులు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై జిల్లా స్థాయి అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం ఉండ‌టం లేద‌ని తెలిపారు. ఈ వాద‌న‌లు విన్న త‌ర్వాత హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌కు డీజీపీ హాజ‌రై.. పోలీసులు నిబంధ‌న‌లు ఎందుకు పాటించ‌డం లేద‌న్న విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News