Sajjala Ramakrishna Reddy: జగన్ మాటలను వక్రీకరించారు.. హరీశ్ రావుకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు: సజ్జల రామకృష్ణారెడ్డి
- మరింత కష్టపడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారన్న సజ్జల
- హరీశ్ రావు వారి రాష్ట్రం గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా
- స్మార్ట్ మీటర్ల వల్ల మంచే జరుగుతుందని వివరణ
తమ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం విజయవంతమయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఇటీవల ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారని... ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారని తెలిపారు. మరింత కష్టపడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారని... అయితే, ఆయన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని... కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని, వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ.... వారి రాష్ట్ర విషయాలను ఆయన చూసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాము స్పందిస్తే మరింత రచ్చ కావడం మినహా మరేమీ ఉండదని చెప్పారు. ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తోందని... వారికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమని అన్నారు.
హరీశ్ రావు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని వ్యాఖ్యానించారు. రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల మంచే జరుగుతుందని... దీనిపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేసే విమర్శలను పట్టించుకోబోమని అన్నారు.