Telangana: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి.. కేఆర్ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదు
- శ్రీశైలం ఎడమగట్టు కాల్వలో విద్యుదుత్పత్తి చేపడుతున్న తెలంగాణ
- కేఆర్ఎంబీకి తెలిపిన ఏపీ జల వనరుల శాఖ
- తెలంగాణ విద్యుదుత్పత్తితో నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని ఆందోళన
- ఖరీఫ్ చివరి పంటకు సాగు నీటితో పాటు తాగు నీటికి ఇబ్బందులు తప్పవని వెల్లడి
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రేకెత్తింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వపై తెలంగాణ విద్యుదుత్పత్తి చేపడుతోందని ఏపీ జలవనరుల శాఖ ఆరోపించింది. సాగు, తాగు నీటి అవసరాల నేపథ్యంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయించాలని కోరుతూ ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు.
ప్రస్తుతం శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్‌లోనూ పూర్తి స్థాయి నీటి మట్టం ఉందని, అయితే ఇప్పటికిప్పుడు విద్యుదుత్పాదన చేపడితే ఖరీఫ్ చివరిలో సాగు నీటితో పాటు తాగు నీటికి కూడా ఇబ్బంది ఎదురు కానుందని ఏపీ ఈఎన్‌సీ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ విద్యుదుత్పత్తి కారణంగా జలాశయాల్లోని నీరు వృథాగా సముద్రం పాలు అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ చేపడుతున్న విద్యుదుత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయించాలని ఆయన తన లేఖలో కేఆర్ఎంబీని కోరారు.