Andhra Pradesh: ఏపీ సలహాదారు పదవికి రాజీనామా చేసిన మురళి... కారణాన్ని వివరిస్తూ జగన్‌కు లేఖ
- మూడేళ్లుగా విద్యాశాఖ సలహదారుగా పనిచేస్తున్న మురళి
- పాఠశాలల మెరుగుదలకు జగన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చారని వెల్లడి
- తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వివరణ
- ఏపీ కంటే తెలంగాణకే తన అవసరం ఉందన్న మురళి
ఏపీ ప్రభుత్వంలో విద్యా శాఖ సలహాదారుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.మురళి తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే... పలువురు వ్యక్తులను జగన్ సర్కారు సలహాదారులుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. వీరిలో పలువురు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇలా తెలంగాణకు చెందిన మురళి ఏపీ విద్యా శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. గడచిన మూడేళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి తాను ఎందుకు రాజీనామా చేస్తున్నానన్న విషయాన్ని జగన్‌కు రాసిన లేఖలో మురళి వివరించారు. తన సొంత రాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆ పరిస్థితులను మెరుగుపరచేందుకే తాను సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. తన సేవలు ఇప్పుడు ఏపీ కంటే తన సొంత రాష్ట్రానికే అవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో విద్యా శాఖకు ప్రత్యేకించి పాఠశాలల మెరుగుదలకు జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ శాఖకు తాను సలహాదారుగా పనిచేయడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని కూడా మురళి పేర్కొన్నారు.