Andhra Pradesh: ఏపీలో ఈ సారి మద్యం షాపుల తగ్గింపు లేదు... పాత పాలసీకి ఏడాది పాటు పొడిగింపు
- నేటితో ముగియనున్న ఏపీ మద్యం పాలసీ
- ఈ పాలసీ ప్రకారం రాష్ట్రంలో 2,934 సర్కారీ మద్యం షాపులు
- ఇదే పాలసీని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- 2023 సెప్టెంబర్ 30 వరకు అమలు కానున్న మద్యం పాలసీ
ఏపీలో శుక్రవారంతో ముగియనున్న మద్యం పాలసీని యథాతథంగా మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం జీవో నెంబరు 662 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీ 2023 సెప్టెంబర్ 30 దాకా కొనసాగనుంది.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండేళ్ల పాటు మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యాపారుల చేతి నుంచి ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంది. గతేడాది మద్యం పాలసీ ప్రకారం రాష్ట్రంలో 2,934 మద్యం షాపులు కొనసాగుతున్నాయి. వీటి సంఖ్యను ఏమాత్రం తగ్గించకుండానే యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.