Crime News: అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ
- పెళ్లై మూడేళ్లయినా కలగని సంతానం
- అత్తంటి వారి సూటిపోటి మాటలను భరించలేక గర్భం దాల్చినట్టు అబద్ధం
- ప్రసవానికని పుట్టింటికి వెళ్లిన నిందితురాలు
- నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి అపహరణ
అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసింది. విషయం తెలిసి వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొన్ని గంటల్లోనే ఆమె చెర నుంచి బాలుడిని విడిపించారు. సికింద్రాబాద్‌లో జరిగిందీ ఘటన. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన లింగాల సోని (22)-రాజు అలియాస్ కిట్టు భార్యభర్తలు. కవాడిగూడ తాళ్లబస్తీలో ఉంటున్న ఉంటున్న వీరికి పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు కలగలేదు. దీంతో అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి వేధింపుల నుంచి బయటపడేందుకు ఆరేడు నెలల క్రితం తాను గర్భం దాల్చినట్టు చెబుతూ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లినట్టు నమ్మించిన సోని బిడ్డతో ఇంటికి రాకుంటే అసలు విషయం బయటపడిపోతుందని భావించింది. దీంతో గురవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని పిల్లల కోసం మాటువేసింది.
ఈ క్రమంలో కర్ణాటకలోని కలబురిగికి చెందిన బి.మంగమ్మ (30) తన ఏడాది వయసున్న కుమారుడితో నిన్న రైల్వే స్టేషన్‌లో నిందితురాలి కంటబడింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపింది. ఆ తర్వాత కాసేపటికి టికెట్ కోసమని వెళ్తూ మంగమ్మ తన బిడ్డను సోనికి అప్పగించింది. అందుకోసమే ఎదురుచూస్తున్న ఆమె బిడ్డను తీసుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమైంది. టికెట్ తీసుకుని వచ్చిన మంగమ్మ తన బిడ్డతోపాటు సోని కూడా కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలు బాబుతో ఆటోలో వెళ్లి కవాడిగూడలో దిగినట్టు గుర్తించారు. అక్కడికి చేరుకుని సోనిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని రక్షించి తల్లికి అప్పగించారు.