5G plans: 5జీ సేవల చార్జీలు అందుబాటులోనే.. : ముఖేశ్ అంబానీ ప్రకటన
- ప్రతి భారతీయుడికీ అందుబాటులో ఉంటాయని వెల్లడి
- ఇంకా 5జీ టారిఫ్ లను ప్రకటించని జియో
- డేటా చార్జీలు గణనీయంగా తగ్గాయన్న ప్రధాని
5జీ సేవలు ఎట్టకేలకు మొదలయ్యాయి. కాకపోతే దేశంలోని కొన్ని పెద్ద పట్టణాల్లోనే తొలుత ఈ సేవలు అక్టోబర్ చివరికి అందుబాటులోకి రానున్నాయి. అయితే, 5జీ టారిఫ్ లు (చార్జీలు) ఎలా ఉంటాయి? అన్న సందేహం అయితే టెలికాం చందాదారుల్లో నెలకొంది. 4జీ సేవలు జియో కారణంగా మొదట చౌకగా ఉండి, ఆ తర్వాత కాలంలో పెరుగుతూ పోతున్నాయి. దీంతో 5జీ సేవల చార్జీలు వీటికంటే ఎక్కువే ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపించాయి.
ఈ సందేహాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ తెరదించారు. జియో 5జీ ప్లాన్లు అందుబాటులోనే ఉంటాయని ప్రకటించారు. ప్రతి భారతీయుడికి ఫోన్ నుంచి సేవల వరకు చార్జీలు అందుబాటులోనే ఉంటాయన్నారు. కాకపోతే జియో 5జీ ప్లాన్లను ఇంకా ప్రకటించలేదు.
మొబైల్ కాంగ్రెస్ లో భాగంగా 5జీ సేవలను శనివారం ప్రారంభించిన ప్రధాని మోదీ అనంతరం మాట్లాడుతూ.. ఒకప్పుడు ఒక జీబీ డేటా చార్జీ రూ. 300గా ఉండేదని, అది ఇప్పుడు రూ. 10కు తగ్గినట్టు చెప్పారు. సగటున ఒక వ్యక్తి ఒక నెలలో రూ. 14 జీబీ వాడతారని, వెనుకటి మాదిరే అయితే దీని కోసం రూ.4,200 ఖర్చు చేయాల్సి వచ్చేదన్నారు.