Rajasthan: రాజస్థాన్ సీఎం మార్పు లేనట్టే.. పదవిలో కొనసాగనున్న గెహ్లాట్!
- బడ్జెట్ పై సూచనలు తనకు పంపాలని ప్రజలను కోరిన అశోక్
- దాంతో సీఎం పదవిలో కొనసాగుతానని హింట్ ఇచ్చిన గెహ్లాట్
- రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరపడిందన్న అభిప్రాయాలు
రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ లో సంక్షోభం ముగిసినట్టు అనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆ పదవిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ సూచనలను నేరుగా తనకు పంపాలని ప్రజలను కోరడంతో తాను సీఎం పదవిలోనే కొనసాగుతానని ఆయన హింట్ ఇచ్చినట్టయింది. ప్రభుత్వం మెరుగైన పథకాలను తీసుకురావడానికి యువత, విద్యార్థులు, సాధారణ ప్రజలు తమ సూచనలను నేరుగా తనకు పంపాలని గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకుంటుందని, వచ్చే బడ్జెట్‌ను విద్యార్థులు, యువతకు అంకితం చేస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ ప్రణాళికను తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. "మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోకుండా చూసేందుకు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు కూడా మా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. కానీ మా ఎమ్మెల్యేలు ఏకమయ్యారు. ఇప్పటికే మా ప్రభుత్వాన్ని కాపాడుకున్నాం. ఇప్పటికీ బలంగానే ఉన్నాం" అని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని అనుకున్న గెహ్లాట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తిరుగుబాటు కారణంగా రేసు నుంచి వైదొలిగారు. అధికార పార్టీ సభ్యుల తిరుగుబాటుపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి గెహ్లాట్ కారణమైతే ఆయనను సీఎం పదవి నుంచి కూడా తప్పించాలన్న ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి గెహ్లాట్ క్షమాపణ కోరారు. దాంతో, గెహ్లాట్ ను సీఎంగా కొనసాగించేందుకు అధిష్ఠానం ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.