Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందనుకుంటే ఖర్గేకు ఓటేయండి... మార్పు కావాలనుకుంటే నాకు ఓటేయండి: శశిథరూర్
- అక్టోబరు 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
- నామినేషన్లు వేసిన థరూర్, ఖర్గే
- కీలక వ్యాఖ్యలు చేసిన థరూర్
- ఖర్గేతో పోటీని యుద్ధంలా భావించొద్దని సూచన
- నిర్ణయాధికారం కాంగ్రెస్ పార్టీ సభ్యులదేనని వెల్లడి
అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రధానంగా మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో, శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మల్లికార్జున ఖర్గేతో తన పోటీ ఓ యుద్ధం అని భావించొద్దని అన్నారు. తామిద్దరూ భిన్న దృక్పథాలకు చెందినవాళ్లమని తెలిపారు. తమలో విజేత ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిర్ణయిస్తారని శశిథరూర్ వెల్లడించారు.
"కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నేను చెప్పేదొక్కటే... కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకలాపాలపై మీరు సంతృప్తి చెందినట్టయితే దయచేసి ఖర్గే గారికి ఓటేయండి. ఒకవేళ మీరు మార్పు కోరుకుంటున్నట్టయితే నాకు ఓటేయండి. పార్టీ వ్యవహార సరళి నచ్చనివారు నన్ను ఎంచుకోండి... పార్టీలో మార్పు తీసుకువచ్చేందుకు నేను సిద్ధమే! సిద్ధాంతపరమైన సమస్యలేమీ లేవు" అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.