Ayyanna Patrudu: చిన్నపిల్లలను బెదిరిస్తారా?... నీ ప్రతాపం ఏదైనా ఉంటే మా మీద చూపించు!: సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు ఫైర్
- అయ్యన్న తనయుడి ఇంట్లో నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు
- చిన్నపిల్లలను ఫొటోలు తీశారన్న అయ్యన్న
- తండ్రి ఆచూకీ కోసం వాళ్లను బెదిరించారని ఆరోపణ
- జనం తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యలు
ఏపీ సీఐడీ పోలీసులు ఇవాళ హైదరాబాదులో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ నివాసంలో నోటీసులు ఇవ్వడం టీడీపీ వర్గాలకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తన కుమారుడి నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు భయోత్పాతం సృష్టించారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై జనం తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
తన కుమారుడి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను డ్రైవర్ అడ్డుకున్నాడని, దాంతో అతడిపై పోలీసులు దాడి చేశారని అయ్యన్న ఆరోపించారు. ఇంట్లోకి బలవంతంగా చొరబడి అణువణువు వెతికారని, విజయ్ ఆచూకీ చెప్పాలని అతడి పిల్లలను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఇది ఏ కేసో చెప్పకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తనిఖీ చేస్తారని అయ్యన్న ప్రశ్నించారు. ఇవి కేవలం కక్షసాధింపు రాజకీయాలేనని అన్నారు.
"ఇంటి యజమాని లేనప్పుడు ఇంట్లోకి ప్రవేశించే అధికారం మీ డిపార్ట్ మెంట్ కు ఎవరిచ్చారు? ఇంట్లోకి చొరబడిన పోలీసులు అక్కడ మా ఆంటీ ఒకామె ఉంటే ఆమెను కూడా బెదిరించారట. ఆఖరికి చిన్నపిల్లలను కూడా బెదిరించారు.
బాబుకు రెండేళ్లు, పాపకు నాలుగేళ్లు... వాళ్లిద్దిరినీ పిలిపించి వాళ్ల ఫొటోలు తీసి, మీ నాన్న ఎక్కడున్నాడో చెబుతారా, చెప్పరా? అంటూ బెదిరించారంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యుడో అర్థమవుతోంది. నీ ప్రతాపం ఏదైనా ఉంటే మా మీద చూపించు. ఇంట్లో ఫొటోలు తీయడానికి నీకు ఎవరిచ్చారు పర్మిషన్?
సీఐడీ బాస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్... కనీసం నీకైనా ఆలోచన రాలేదా? నీకైనా బుద్ది ఉండక్కర్లేదా? ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేసేయడమేనా? ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ప్రశ్నించాలి. ఏ నోటీసులు లేకుండా ఇంట్లోకి వచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు?" అంటూ నిప్పులు చెరిగారు.
అటు, నర్సీపట్నంలోని తన నివాసంలోకి వచ్చేందుకు కూడా సీఐడీ పోలీసులు పట్టణానికి వచ్చారని అయ్యన్న వెల్లడించారు. అక్కడ మా అబ్బాయి ఇంటికి వెళ్లారు, ఇక్కడ నర్సీపట్నంకు కూడా చేరుకున్నారు... ఏంచేస్తారు మీరు? అంటూ నిలదీశారు.
తామేమీ తప్పు చేయలేదని, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయాలన్న ధర్మం కోసం, మా నేతలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. బెదిరింపులకు లొంగిపోయే ప్రశ్నేలేదని, రెచ్చగొడితే మరింత రెచ్చిపోతామని అన్నారు. "తిరుగుబాటు వచ్చిందంటే ప్రజలు ఎవర్నీ లెక్కచేయరని మీ బాస్ కు చెప్పండి. ప్రజలు రెచ్చిపోయారంటే పోలీసులే కాదు, సీఐడీనే కాదు, ఈ ముఖ్యమంత్రిని కూడా లెక్కచేయరు" అని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.
ఇప్పటికే సీఐడీకి హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయని, అయినా వారిలో మార్పు రావడంలేదని అన్నారు. తాజా నోటీసుల అంశంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అయ్యన్న వెల్లడించారు.