TDP: జగన్ పెంపుడు చిలుకలా ఏపీ సీఐడీ: అచ్చెన్నాయుడు
- చింతకాయల విజయ్ ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ
- ఘటనపై తీవ్రంగా స్పందించిన అచ్చెన్నాయుడు
- జగన్ మాట విన్నవారంతా కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్య
- సీఐడీ చట్ట వ్యతిరేక సంస్థగా మారిపోతోందని ఆరోపణ
టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారుల తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీఐడీ పెంపుడు చిలుకలా మారిపోయిందని ఆయన విమర్శించారు. జగన్ చెప్పినట్లు నడిచిన వారంతా ఇప్పుడు కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని, ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఇకనైనా ఏపీ సీఐడీ అధికారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఆయన సూచించారు.
జగన్ చెప్పినట్లుగా వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం, బెదిరింపులు, దాడులకు పాల్పడటమే సీఐడీ పనా? అని అచ్చెన్న ప్రశ్నించారు. విజయ్ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన ఇంటిలోని ఐదేళ్ల వయసున్న పిల్లలను భయపెట్టేలా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయసూత్రాలకు అనుగుణంగా పనిచేయాల్సిన సీఐడీ.. చట్ట వ్యతిరేక వ్యవస్థగా మారిపోతోందని ఆయన ఆరోపించారు.