Congress: హైదరాబాద్ మీదుగా రాహుల్ యాత్ర... రెండు రూట్లను సిద్ధం చేసిన టీ కాంగ్రెస్
- ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్ యాత్ర
- డీజీపికి రెండు రూట్ మ్యాప్‌లు అందించిన రేవంత్ రెడ్డి
- చార్మినార్, గాంధీ భవన్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు మీదుగా తొలి రూట్
- శంషాబాద్, రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, బీహెచ్ఈఎల్ మీదుగా వెళ్లేలా మరో రూట్ మ్యాప్
భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లనుంది. ఈ నెల 24న ఈ యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాహుల్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... పోలీసుల అనుమతి కోసం నేడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రెండు రూట్ మ్యాప్‌లను డీజీపీకి అందజేశారు. వీటిలో ఒకదానిని పోలీసులు అనుమతించనున్నారు.
హైదరాబాద్‌లో రాహుల్ యాత్రకు సంబంధించి రెండు రూట్ మ్యాప్‌లను టీపీసీసీ ఖరారు చేయగా... అందులో చార్మినార్ నుంచి గాంధీ భవన్, జూబ్లీ హిల్స్ మీదుగా పటాన్‌చెరు చేరుకునేలా ఓ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇక రెండో రూట్ శంషాబాద్ నుంచి రాజేంద్ర నగర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), బీహెచ్ఈఎల్ మీదుగా వెళ్లనుంది. ఈ రెంటిలో పోలీసులు దేనికి అనుమతి ఇస్తారన్నది త్వరలోనే తేలనుంది.