Tirupati: వైభవంగా పున్నమి గరుడ సేవ... పాల్గొన్న సీజేఐ దంపతులు
- తిరుమల మాఢ వీధుల్లో గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారు
- భారీగా తరలివచ్చిన భక్తులు
- గరుడ సేవలో పాల్గొన్న ఏపీ, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వాహన సేవగా గుర్తింపు పొందిన పున్నమి గరుడ సేవ శనివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమైంది. గరుడ వాహనంపై శ్రీవారు తిరుమల మాఢ వీధుల్లో విహరిస్తున్నారు.
శ్రీవారి గరుడ సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా మాఢ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సతీసమేతంగా పున్నమి గరుడ సేవలో పాల్గొన్నారు. సీజేఐతో పాటు ఏపీ, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా స్వామి వారి గరుడ సేవకు హాజరయ్యారు.