S Jai Shankar: పాకిస్థాన్ కూడా 'ఐటీ' దిగ్గజమే.. సెటైర్ వేసిన భారత విదేశాంగ మంత్రి జై శంకర్
- వడోదరలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జై శంకర్
- ఇంటర్నేషనల్ టెర్రరిజం అంటూ ఐటీకి కొత్త భాష్యం
- భారత్ ఏళ్ల తరబడి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని వెల్లడి
పదవీబాధ్యతలతో ఎప్పుడూ సీరియస్ గా ఉండే భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ పాకిస్థాన్ విషయంలో అదిరిపోయే సెటైర్ వేశారు. పాకిస్థాన్ కూడా 'ఐటీ' దిగ్గజమేనని వ్యంగ్యం ప్రదర్శించారు.
గుజరాత్ లోని వడోదరలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ "మనకో పొరుగుదేశం ఉంది. మనం ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఎలా దిగ్గజాలుగా పేరుపొందామో, వారు కూడా ఓ ఐటీ (ఇంటర్నేషనల్ టెర్రరిజం)లో దిట్టలు అనిపించుకున్నారు.
ఇది ఇప్పటిది కాదు.. ఏళ్ల తరబడి భారత్ ఎదుర్కొంటున్న సమస్య. అయితే అది టెర్రరిజం అని, దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని మనం తక్కిన ప్రపంచానికి వివరిస్తున్నాం. ఇవాళ మేం టెర్రిరజం బారినపడ్డాం... రేపు అది మీకు ఎదురుకావొచ్చు" అని జై శంకర్ వివరించారు.
జై శంకర్ ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. పాక్ తో ఎఫ్-16 విమానాల డీల్ ను అమెరికా కొనసాగించాలని నిర్ణయించుకోవడాన్ని ఆయన అమెరికా గడ్డపైనే ప్రశ్నించారు. పాక్ యుద్ధ విమానాలకు విడిభాగాల సరఫరాకు సంబంధించి 450 మిలియన్ డాలర్ల ఒప్పందానికి బైడెన్ సర్కారు ఆమోదం తెలపడం పట్ల భారత ప్రభుత్వ వైఖరిని సమర్థంగా వినిపించారు.