avalanche: నేపాల్ లో మరోసారి హిమోత్పాతం.. వీడియో చూడండి..
- మనస్లు బేస్ క్యాంప్ ను తాకిన హిమోత్పాతం
- పరుగులు తీసిన పర్వతారోహకులు
- ఈ ఏడాదికి గాను పర్వతారోహణకు 400 మందికి అనుమతి
మరోసారి నేపాల్ లో హిమోత్పాతం విరుచుకుపడింది. ఆదివారం మౌంట్ మనస్లు బేస్ క్యాంప్ ను హిమోత్పాతం తాకింది. ఇదే తరహా హిమోత్పాతానికి ఓ భారతీయ పర్వతారోహకుడు సహా ఇద్దరు మరణించిన వారం వ్యవధిలోనే మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
బేస్ క్యాంప్ లో ఏర్పాటు చేసుకున్న కొన్ని టెంట్ లు దెబ్బతిన్నాయి. ఎవరికైనా గాయాలయ్యాయా? అన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. మనస్లు పర్వతారోహణకు ఈ ఏడాదికి గాను నేపాల్ 400 మందికి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 26 నాటి హిమోత్పాతానికి ఇద్దరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. హిమోత్పాతం వేగంగా వస్తుండగా, బేస్ క్యాంప్ దగ్గరున్న వారు పరుగులు తీయడం వీడియోలో చూడొచ్చు.
తాజా ఘటన తర్వాత సహాయక చర్యలు మొదలయ్యాయి. మనస్లు పర్వతం ప్రపంచంలోనే ఎనిమిదో అత్యంత ఎత్తయినది. ప్రమాదకరమైన పర్వతాల్లో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ పర్వతారోహణకు వచ్చిన వారిలో 53 మంది మరణించారు.