CM KCR: దసరా రోజున జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్న సీఎం కేసీఆర్
- మంత్రులు, జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ సమావేశం
- పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం
- కొత్త పార్టీ పేరుతో మునుగోడు బరిలో దిగుతామని వెల్లడి
- తమదే విజయం అని ధీమా
- సర్వేలన్నీ తమకే అనుకూలమని స్పష్టీకరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో హైదరాబాదులో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది.
తాజా రాజకీయ పరిణామాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబరు 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మునుగోడులో అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని అన్నారు.