Plane: గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.... దూసుకొచ్చిన తూటా

Firing on Myanmar plane

  • మయన్మార్ లో ఘటన
  • నెపిడో నగరం నుంచి లోయికా బయల్దేరిన విమానం
  • విమానం గోడలను చీల్చుకొచ్చిన తూటా
  • ఓ ప్రయాణికుడి చెంపకు గాయం

మయన్మార్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోకి తూటా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. 

మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నెపిడో నగరం నుంచి లోయికా సిటీకి బయల్దేరింది. ల్యాండింగ్ కు సిద్ధమవుతుండగా, విమానం గోడలను చీల్చుకుంటూ  ఓ తూటా దూసుకొచ్చింది. విండో పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడి చెంపకు గాయం చేసింది. దాంతో విమానంలో ఉన్నవారు హడలిపోయారు. ఆ సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన ప్రయాణికుడిని విమానం ల్యాండ్ అయిన తర్వాత హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. 

తూటా ఘటనపై మయన్మార్ సైనిక ప్రభుత్వం స్పందించింది. లోయికా సిటీకి విమానాలను రద్దు చేసింది. విమానాశ్రయం వద్ద భారీగా సైనికులను రంగంలోకి దించింది. 

ఇది తమ ప్రత్యర్థి పక్షం కరెన్ నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ (కేఎన్ పీపీ) పనే అని మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేఎన్ పీపీ ఖండించింది. జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News