Team India: పోరాడి ఓడిన సఫారీలు... మ్యాచ్ తో పాటు సిరీస్ ను చేజిక్కించుకున్న టీమిండియా
- గువాహటిలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
- 16 పరుగుల తేడాతో భారత్ విజయం
- చివరి వరకు పోరాడిన మిల్లర్, డికాక్
- లక్ష్యానికి చేరువగా వచ్చిన సఫారీలు
- సిరీస్ 2-0తో టీమిండియా కైవసం
గువాహటిలో హోరాహోరీగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ భారీ స్కోర్ల మ్యాచ్ లో టీమిండియా 16 పరుగుల తేడాతో నెగ్గింది.
భారీ లక్ష్యం అయినప్పటికీ సఫారీలు చివరి వరకు పోరాడారు. డేవిడ్ మిల్లర్ వీరోచిత సెంచరీ, డికాక్ పోరాటం వృథా అయ్యాయి. మిల్లర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డికాక్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. మార్ క్రమ్ 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది.
ఓ దశలో దక్షిణాఫ్రికా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ జోడీ ఎదురుదాడికి దిగడంతో సఫారీ స్కోరుబోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ ఎడాపెడా షాట్లు కొట్టడంతో లక్ష్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది.
చివర్లో 10 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఆఖర్లో 6 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి రాగా... మిల్లర్ సిక్సర్లతో విరుచుకుపడినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే అతడి సెంచరీ మాత్రం పూర్తయింది. ఓ భారీ సిక్సర్ తో మిల్లర్ శతకం సాధించడం హైలెట్ గా నిలిచింది.
టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్ ఈ నెల 4న ఇండోర్ లో జరగనుంది. కాగా, సొంతగడ్డ మీద దక్షిణాఫ్రికాపై టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం .