Ponniyin Selvan: బాక్సాఫీస్ వద్ద 'పీఎస్1' ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ. 230 కోట్ల వసూళ్లు
- తొలి వారాంతంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 230 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన చిత్రం
- ఐమాక్స్ స్క్రీన్లపై కూడా రికార్డులు సృష్టిస్తున్న 'పీఎస్1'
- రూ. 500 కోట్లతో తెరకెక్కిన చిత్రం
భారీ తారాగణంతో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించినిన 'పొన్నియన్ సెల్వన్ (పీఎస్1)' పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు రూ. 250 కోట్ల మార్క్‌ను అధిగమించబోతోంది. వసూళ్ల వర్షం ఇదే స్పీడ్‌లో కొనసాగితే ఈ చిత్రం తొందర్లనే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల్లోకి దూసుకుపోయే అవకాశం ఉంది. ఇదే సమయంలో 'పీఎస్1' బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ప్రకారం, 'పొన్నియిన్ సెల్వన్' థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లో (తొలి వారాంతంలోనే) ప్రపంచ వ్యాప్తంగా రూ. 230 కోట్ల పైచిలుకు కలెక్షన్లను సాధించిందని ఆయన ట్వీట్ చేశారు. 'పొన్నియిన్ సెల్వన్' ఐమాక్స్‌లో కూడా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఐమాక్స్ స్క్రీన్లలో ఉత్తర అమెరికా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఆల్-టైమ్ నెం.1 ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది.
అమెరికాలోని ఐమాక్స్ ల్లో ఆల్-టైమ్ నెం.3 ఓపెనింగ్ ను ఈ సినిమా రాబట్టింది. భారతదేశంలో ఐమాక్స్ లో ఆల్-టైమ్ నెం.4 గా నిలిచిందని రమేశ్ బాలా పేర్కొన్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్'లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.