Prashant Kishor: పాదయాత్ర మొదలు పెట్టీపెట్టగానే పీకేకు షాక్.. జనం లేక వెలవెలబోయిన సభ
- రాజకీయాల్లో మార్పు కోసమంటూ పాదయాత్ర
- 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు ఆదివారం శ్రీకారం
- పశ్చిమ చంపారణ్ జిల్లాలో నిర్వహించిన సభకు రాని జనం
ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన ప్రశాంత్ కిశోర్ (పీకే) తన విషయంలో మాత్రం ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. తన వ్యూహ రచనతో ఎన్నో రాష్ట్రాల్లో తాను పనిచేసిన పార్టీలను అందలం ఎక్కించిన పీకే.. తన వరకు వచ్చే సరికి ఏం చేయలేకపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. మార్పు కోసం అంటూ సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్న ఆయన 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ఆదివారం శ్రీకారం చుట్టారు.
యాత్ర చేపట్టిన తొలి రోజే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో నిర్వహించిన సభకు పట్టుమని పదిమంది కూడా హాజరు కాకపోవడంతో అది కాస్తా వెలవెలబోయింది. సభా ప్రాంగణం మొత్తం బోసిపోయి కనిపించింది. స్థానికులు కూడా పీకే సభపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఆయన వెంట నడిచిన కొద్దిమంది మాత్రమే కనిపించారు. కాగా, పీకే పాదయాత్ర 12-15 నెలలపాటు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాలను ఈ పాదయాత్రలో కవర్ చేస్తారు.