Narendra Modi: ప్రస్తుత సంక్షోభాన్ని సైనిక చర్యతో పరిష్కరించలేరు: జెలెన్ స్కీతో ఫోన్ లో సంభాషించిన ప్రధాని మోదీ
- ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
- చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన
- శాంతి ప్రయత్నాలకు భారత్ సిద్ధమని వెల్లడి
- అణుకేంద్రాల భద్రతపై ఆందోళన
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో ఫోన్ లో సంభాషించారు. ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సైనిక పరిష్కారం లేదని, చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి నియమావళి, అంతర్జాతీయ చట్టం, అన్ని దేశాల ప్రాదేశిక, సార్వభౌమత్వాన్ని గౌరవించడం ముఖ్యమని సూచించారు.
అంతేకాదు, ఉక్రెయిన్ లో ఉన్న అణుకేంద్రాల భద్రత పట్ల కూడా భారత్ ఆలోచిస్తుందని, అలాంటి అణుకేంద్రాలకు ముప్పు వాటిల్లితే ప్రజలపైనా, పర్యావరణపరంగా కలిగే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని తెలిపారు. ఈ టెలిఫోన్ సంభాషణలో భాగంగా, భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.