Russia: యుద్ధంలో పాల్గొనాలంటూ నోటీసు.. తనవల్ల కాదంటూ భవనం పైనుంచి దూకి రష్యన్ డిస్క్ జాకీ ఆత్మహత్య

Russian Rapper Dies by Suicide after received notice Against Ukraine War

  • ఉక్రెయిన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం
  • నిర్బంధ సైనిక సమీకరణ చేపడుతున్న రష్యా
  • ప్రత్యర్థులను చంపలేనంటూ 10వ అంతస్తు పైనుంచి దూకి డీజే ఆత్మహత్య
  • పుతిన్‌ను యుద్ధోన్మాదిగా అభివర్ణించిన డిస్క్ జాకీ
  • ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

రష్యన్ సైన్యంలో చేరి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడాలంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసు అందుకున్న ఓ డిస్క్ జాకీ (డీజే) భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా నెలలు గడుస్తున్నా ప్రభావం చూపించలేకపోతోంది. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఇరువైపుల   నుంచి భారీ నష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసి ఉక్రెయిన్‌పై పైచేయి సాధించాలని చూస్తున్న రష్యా నిర్బంధ సైనిక సమీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా యుద్ధంలో చేరాలంటూ పౌరులకు నోటీసులు పంపిస్తోంది. ప్రభుత్వం నుంచి అందుతున్న నోటీసులపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సైన్యంలో చేరాల్సి వస్తుందన్న కారణంతో చాలామంది దేశాన్ని వీడుతున్నారు.

ఈ క్రమంలో క్రాస్నోడార్‌ నగరానికి చెందిన 27 ఏళ్ల ర్యాపర్ డీజే ఇవాన్ విటలీవిచ్ పెటునిన్‌కు కూడా ప్రభుత్వం నుంచి నోటీసు అందింది. వాకీ పేరుతో స్టేజి షోలు ఇచ్చే ఈ డీజే.. యుద్ధం పేరుతో ప్రత్యర్థుల ప్రాణాలు తీసేందుకు తాను సిద్ధంగా లేనంటూ ఓ భారీ భవనంలోని 10వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. పాక్షిక సైనిక సమీకరణ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ త్వరలోనే అది పూర్తిస్థాయిలో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశాడు. పుతిన్‌ను యుద్ధ ఉన్మాదిగా అభివర్ణించిన పెటునిన్.. ఈ వీడియోను మీరు చూసే సమయానికి తాను సజీవంగా ఉండనని పేర్కొన్నాడు. కాగా, పెటునిన్ గతంలో సైన్యంలో చేశాడని, ప్రస్తుతం మానసిక చికిత్స తీసుకుంటున్నట్టు అమెరికన్ మీడియా పేర్కొంది.

  • Loading...

More Telugu News