TRS: బీఆర్ఎస్గా టీఆర్ఎస్ మారిన వేళ... సొంత గూటికి చేరిన నల్లాల ఓదేలు దంపతులు
- 4 నెలల క్రితం టీఆర్ఎస్ను వీడిన నల్లాల ఓదేలు దంపతులు
- కాంగ్రెస్లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే
- ఓదేలు దంపతులను సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్
తెలంగాణకు చెందిన పార్టీగానే నిన్నటిదాకా కొనసాగిన టీఆర్ఎస్... దసరా పర్వదినాన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. 21 ఏళ్ల పాటు అప్రతిహాతంగా ప్రస్థానం కొనసాగించిన టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ కీలక పరిణామం చోటుచేసుకున్న రోజే... బీఆర్ఎస్కు కలిసి వచ్చే మరో పరిణామం కూడా చోటుచేసుకుంది.
టీఆర్ఎస్ను వీడిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు 4 నెలల క్రితం కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా నల్లాల ఓదేలు సతీసమేతంగా తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ను వీడి సొంత గూటికి వచ్చిన వీరిని మంత్రి కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాల్క సుమన్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.