Telangana: విజయ దశమి నాడు ప్రారంభమైన బీఆర్ఎస్ దేశంలో విజయ దుందుభి మోగిస్తుంది: ఎంపీ నామా
- బీఆర్ఎస్ ప్రారంభంపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ నామా
- తెలంగాణ మోడల్‌ను బీఆర్ఎస్ దేశానికి దిక్సూచిగా మారుస్తుందని వెల్లడి
- దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ నూతన అధ్యాయాన్ని లిఖించనుందని వ్యాఖ్య
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన టీఆర్ఎస్పై ఆ పార్టీకి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తమ పార్టీ జాతీయ స్థాయిలో విజయం సాధించి తీరుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ దశమి నాడు ప్రారంభమైన బీఆర్ఎస్ దేశంలో విజయ దుందుభి మోగిస్తుందని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్ దేశ భవిష్యత్తునే మార్చబోతోందని నామా నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు దేశ రాజకీయాల్లో నవ శకానికి నాందీ పలికిందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బుధవారం ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైందన్న ఆయన... బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని లిఖించనుందన్నారు. దేశ ప్రజల అభ్యున్నతికి బీఆర్ఎస్ అవిశ్రాంత కృషి చేయనుందని ఆయన తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశానికి దిక్సూచిగా మార్చనున్నామని నామా తెలిపారు.