Amit Shah: పాకిస్థాన్ తో చర్చలా.. అది అసలు జరగని పని.. : అమిత్ షా
- కొందరు పాకిస్థాన్ తో చర్చలు జరపాలంటున్నారని, ఎందుకు జరపాలని ప్రశ్న
- అవసరమైతే జమ్మూకశ్మీర్ ప్రజలతో మాట్లాడుతామన్న కేంద్ర హోం మంత్రి
- మోదీ నేతృత్వంలోని కేంద్రం దేశంలో ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేస్తుందని వ్యాఖ్య
పాకిస్థాన్ తో చర్చలు జరపాలని కొందరు చెబుతున్నారని. పాకిస్థాన్ తో మనం ఎందుకు చర్చలు జరపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. పాకిస్థాన్ తో చర్చలు జరపడం అనేది జరగని పని అని స్పష్టం చేశారు. అవసరమైతే జమ్మూకశ్మీర్ ప్రజలతో మాట్లాడుతామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా బుధవారం బారాముల్లాలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడారు.
శాంతియుత ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
జమ్మూకశ్మీర్ ను దేశంలోనే అత్యంత శాంతియుత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా ప్రకటించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), నెహ్రూ-గాంధీ (కాంగ్రెస్) కుటుంబాలే కారణమని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమ్మూకశ్మీర్ ను ఈ మూడు కుటుంబాలే చాలా కాలం పాలించాయన్నారు. ఇన్నేళ్లుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం పెచ్చుమీరిందని.. 42 వేల మందిని పొట్టన పెట్టుకుందని పేర్కొన్నారు. అదే ప్రధాని మోదీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు.