Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు.. హైదరాబాద్ లో ఇప్పటికే మొదలైన వర్షం
- అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతున్నాయన్న వాతావరణ శాఖ
- హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఊపందుకున్న వాన
- పలు ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్న రోడ్లు
తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్నిచోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని వెల్లడించింది.
హైదరాబాద్ లో వాన మొదలు
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచే వానలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో అయితే సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, పీర్జాదిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. భారీ వర్షంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు చెరువులుగా మారాయి.