USA: ఒకే లాటరీకి 200 టికెట్లు కొన్నాడు.. రూ. 8 కోట్లు జేబులో వేసుకున్నాడు!
- అమెరికాలోని అలెగ్జాండ్రియాలో ఓ వ్యక్తికి కలసి వచ్చిన అదృష్టం
- తాను పుట్టినరోజు, పుట్టిన సంవత్సరం నంబర్ల ఆధారంగా టికెట్లు కొన్న వ్యక్తి
- 200 టికెట్లకు 5 వేల డాలర్ల చొప్పున 10 లక్షల డాలర్లు బహుమతి వచ్చిన వైనం
తన పుట్టినతేదీ, సంవత్సరం కలిపిన నంబర్ తో లాటరీ టికెట్లు కొన్న వ్యక్తికి బంపర్ బహుమతి కలిసి వచ్చింది. అయితే ఏదో ఒక టికెట్ కొనకుండా.. ఏకంగా 200 టికెట్లు కొన్నాడు. ఒక్కో టికెట్ కు ఒక్కో డాలర్ చొప్పున 200 డాలర్లు పెట్టి టికెట్లు కొంటే.. ఏకంగా 10 లక్షల డాలర్లు (మన కరెన్సీలో రూ. 8 కోట్లకుపైనే) బహుమతి రావడం గమనార్హం.
అమెరికాలోకి అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన ఆయన పేరు అలీ. తాను అన్నీ 0-2-6-5 నంబర్ సిరీస్ ఉన్న లాటరీ టికెట్లు కొని జాక్ పాట్ కొట్టాడు. ఈ రెండు వందల టికెట్లకు ఒక్కోదానికి 5 వేల డాలర్ల చొప్పున బహుమతి తగిలింది. అంటే మొత్తం కలిపి 10 లక్షల డాలర్లు అన్నమాట.
నంబర్ సిరీస్ లాటరీలతో..
అమెరికాలో జరిగే లాటరీ టికెట్లలో సిరీస్ తరహా డ్రాలు తీస్తుంటారు. ఉదాహరణకు కేవలం మూడు సంఖ్యల లాటరీ అనుకుంటే.. ఎన్ని వేలు, లక్షల లాటరీ టికెట్లు అమ్మినా కూడా.. వాటిలో.. సదరు డ్రాలో తీసిన చివరి మూడు సంఖ్యలు ఉన్న టికెట్లు అన్నీ కూడా బహుమతికి ఎంపిక అవుతాయన్నమాట. అలీ తాను కొన్న మొత్తం 200 టికెట్లు కూడా చివరన ఒకే నంబర్ వచ్చేలా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అలీకి కొన్న మొత్తం టికెట్లకు బహుమతి తగలడం గమనార్హం.
లాటరీలు తగలడం అరుదు
అయితే లాటరీ తగలడం అనేది అత్యంత అరుదైన విషయం. లక్షల మంది లాటరీ టికెట్లు కొంటుంటే.. అందులో ఏ ముగ్గురు, నలుగురికో అదృష్టం కలిసి వస్తుంది. ఇది వ్యసనంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే చాలా దేశాలు లాటరీలను నిషేధించాయి. అమెరికాలో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో లాటరీలకు అధికారికంగానే అనుమతులు ఉంటాయి.