Supreme Court: మనిషన్న వాడు భార్యాబిడ్డల పోషణ కోసం కూలి పనైనా చేయాలి: సుప్రీంకోర్టు
- ఓ ఫ్యామిలీ కేసులో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు
- భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
- భార్యాబిడ్డల పోషణ బాధ్యతను తప్పించుకోలేడని వెల్లడి
సుప్రీంకోర్టులో జస్టిస్ దినేశ్ మహేశ్వరి, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఓ కుటుంబ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విడిపోయిన భార్య, మైనర్ బిడ్డల భరణం నిమిత్తం భర్త కూలి పనైనా చేసి డబ్బు సంపాదించాలని బెంచ్ అభిప్రాయపడింది. అది అతడి ధర్మం అని స్పష్టం చేసింది. ఈ బాధ్యతల నుంచి అతడి తప్పించుకోజాలడని పేర్కొంది.
వ్యాపారం మూతపడినందున భార్యాబిడ్డలకు ఏమీ ఇవ్వలేనంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఆ వ్యక్తి పిటిషన్ ను తిరస్కరించింది.
"శారీరకంగా ఎలాంటి లోపాలు లేనప్పుడు డబ్బు సంపాదించడం అనేది భర్త కర్తవ్యం. గతంలో ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చిన ఈ కేసులో భర్త తన భార్యను, మైనర్ కుమారుడ్ని నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి పనిచేసి సంపాదించడానికి తగిన వనరులు ఉన్నాయని కోర్టు నమ్ముతోంది. కానీ భార్యాబిడ్డల పోషణలో అతడు విఫలమయ్యాడు" అంటూ ధర్మాసనం పేర్కొంది.
అంతేకాదు, ప్రతి నెలా భార్యకు రూ.10 వేలు, మైనర్ కుమారుడికి రూ.6 వేలు చొప్పున పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆ వ్యక్తిని ఆదేశించింది. మెట్టినింటిని వదిలేసిన మహిళ తన చిన్న పిల్లలతో సొంతంగా జీవనం సాగించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత భర్తపై ఉంటుందని పేర్కొంది.