Vangalapudi Anitha: రాజకీయ లబ్ధి ఉన్నప్పుడే మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందిస్తారా?: వాసిరెడ్డి పద్మపై వంగలపూడి అనిత ఫైర్

Vangalapudi Anitha fires on Vasireddy Padma

  • శ్రీ సత్యసాయి జిల్లాలో మైనర్ బాలిక ఆత్మహత్య
  • టీడీపీ నేత వేధింపులే కారణమంటూ ఆరోపణలు
  • సీరియస్ గా పరిగణిస్తున్నామన్న వాసిరెడ్డి పద్మ
  • గతంలో ఎందుకు సీరియస్ గా తీసుకోలేదన్న అనిత

శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత వేధింపుల కారణంగా మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఏపీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో విజయవాడలో వినోద్ జైన్ వ్యవహారం జరిగినప్పుడే చంద్రబాబు టీడీపీ నేతలకు బుద్ధి చెప్పి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. 

ఇలాంటి ఘటనల్లో చంద్రబాబు స్పందన సరిగాలేదని, చంద్రబాబు ఇటువంటి నేతలను వెనకేసుకురావడం వల్లే పదే పదే వేధింపుల ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ తరహా ఘటనలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని, కీచక టీడీపీ నేతలకు గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. 

అయితే, వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై టీడీపీ తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. మహిళా కమిషన్ ను రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ విమర్శల కోసం చైర్ పర్సన్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. 

"మహిళలను వేధించేది ఎవడైనా పార్టీలకతీతంగా చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ప్రజలకు అర్ధంకాని విషయం ఏంటంటే.. రాజకీయ లబ్ధి ఉన్నప్పుడే మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందిస్తారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో దాదాపుగా 40 వరకు అఘాయిత్యాలు జరిగాయి. పలు ఘటనల నిందితుల్లో వాలంటీర్లు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. సామూహిక అత్యాచారం చేసి, హత్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇన్ని ఘటనల్లో నువ్వు ఎప్పుడు స్పందించావు? 

మొన్నటికి మొన్న ఓ సీఐ ఒక మహిళను దారుణంగా కొడితే, ఇక్కడి మహిళా కమిషన్ సభ్యురాలు కూడా స్పందించింది... జాతీయ మహిళా కమిషన్ కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. నువ్వు మాత్రం నోరు మెదపలేదు. అంటే ఎక్కడెక్కడ వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడతావో, అక్కడ మాత్రం బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేయాలని నిర్ణయించుకున్నావా?

స్నేహలత అనే ఎస్సీ యువతిని చంపి, కిరాతకంగా కాల్చినప్పుడు, తేజస్విని అనే ఫార్మసీ విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసినప్పుడు, ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసు తెరపైకి వచ్చినప్పుడు తమరు ఎక్కడున్నారు?

కేవలం సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలనే ఇక్కడ ప్రస్తావించాను. వీటిలో ఎప్పుడైనా, ఒక్కసారైనా నువ్వు స్పందించావా... ఒక్కసారి పరిశీలించి చూసుకో? వీళ్ళందరూ ఆడపిల్లలు కారా? ఈ స్త్రీల కోసం నీ కమిషన్ పనిచేయదా? మీకు మనస్సాక్షి ఉంటే ప్రశ్నించుకోండి. అందరు మహిళలను సమానంగా చూసి, సమన్యాయం చేయండి" అంటూ అనిత నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News