Lollypops: లాలీపాప్ లు తింటూ, పేర్చుతూ..11,602 లాలీపాప్ లతో ప్రపంచ రికార్డు!
- దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన వలంటీర్లు
- ఒకదానికి ఒకటి తాకేలా కిలోమీటర్ పొడవున జాగ్రత్తగా లాలీపాప్ లు పేర్చిన తీరు
- అంతా జాగ్రత్తగా పరిశీలించి రికార్డుల్లోకి ఎక్కించిన గిన్నిస్ బుక్
ఏదో ఒక చిత్రమైన పనిచేయడం.. రికార్డు సృష్టించడం.. ఈ మధ్య చాలా మందికి ఇదొక హాబీగా కూడా మారిపోయింది. అందులోనూ చిన్నచిన్నవి, ఎవరైనా చేయగలిగినవి అయిన పనుల్లో కూడా రికార్డులు సృష్టించడం అప్పుడప్పుడూ కనిపిస్తుంటుంది. ఇలాగే దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో నేషనల్ సీ రెస్క్యూ ఇనిస్టిట్యూట్ కు చెందిన వలంటీర్లు లాలీపాప్ లతో ప్రపంచ రికార్డు సృష్టించారు.
27 మంది కలిసి ఓ బృందంగా..
నేషనల్ సీ రెస్క్యూ ఇనిస్టిట్యూట్ కు చెందిన 27 మంది కలిసి లాలీపాప్ లతో రికార్డు సృష్టించారు. ఇందుకోసం ఒకదాని వెనుక మరొకటి తాకుతూ ఉండేలా లాలీపాప్ లను పేర్చుకుంటూ వెళ్లారు. మొత్తంగా ఒక కిలోమీటరు పొడవున సుమారు 11,602 లాలీపాప్ లను పేర్చారు. ఎంతైనా లాలీపాప్ లు కదా నోరూరుతాయి. అందుకే కొందరు లాలీపాప్ లను చప్పరిస్తూ.. తమ రికార్డు కోసం పేరుస్తూ వెళ్లారు. మొత్తంగా కేవలం 90 నిమిషాలు.. అంటే గంటన్నరలోనే లాలీపాప్ లను పేర్చడం పూర్తి చేయడం గమనార్హం.
- ఎక్కడా లాలీపాప్ ల మధ్య గ్యాప్ రావడానికి వీల్లేదని, ప్రతీది ఒకదానికొకటి తాకుతూ ఉండాలని గిన్నిస్ బుక్ ప్రతినిధులు నిబంధన పెట్టారు. దీనితో ప్రతి లాలిపాప్ ను జాగ్రత్తగా తాకుతూ ఉండేలా అమర్చారు.
- అయితే ఈ లాలీపాప్ లను పేర్చడాన్ని నేరుగా ఒక లైన్ గా కాకుండా.. ఓ పెద్ద గ్రౌండ్ లో మెలికలు మెలికలుగా పేర్చుకుంటూ వెళ్లారు. గిన్నిస్ బుక్ కు సంబంధించిన ప్రతినిధులు దీనంతటినీ పరిశీలించి రికార్డులో నమోదు చేశారు.