Congress: ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్
- నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారంపై ఈడీ కేసు
- ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన సోనియా, రాహుల్ గాంధీలు
- తన విచారణ ముగిసిందని ప్రకటించిన గీతారెడ్డి
- గాలి అనిల్ కుమార్ను 5 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీలు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
గీతారెడ్డితో పాటు తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఇటీవలే ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన గీతారెడ్డి... ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. స్వల్ప వ్యవధిలోనే ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆమె...నేషనల్ హోరాల్డ్ కేసులో తన విచారణ పూర్తి అయినట్లుగా తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్ కూడా గురువారం ఈడీ విచారణకు హాజరు కాగా.. ఆయనను ఈడీ అధికారులు 5 గంటల పాటు విచారించారు.